Ap inter education: ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..! 21 h ago
AP : ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. "చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తాం. 2024- 25 నుంచి పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతాం. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని పేర్కొన్నారు.
15 రాష్ట్రాల్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తామన్నారు. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందని అన్నారు. ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచాం" అని కృతికా పేర్కొన్నారు.